ఢిల్లీ: దేశ ప్రతిష్టాత్మక సంస్థ జేఎన్‌యూ (జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం) విద్యార్థులకు ఊరట లభించింది. విద్యార్థుల ఆందోళనలతో ఫీజుల పెంపు నిర్ణయాన్ని అధికారులు వెనక్కి తీసుకున్నారు. అలాగే ఆర్థికంగా వెనకబడిన వర్గాల విద్యార్థులకు ఆర్థిక సహాయం చేయనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు జేఎన్‌యూ ఎగ్జిక్యూటివ్ కమిటీ హాస్టల్ ఫీజును తగ్గించినట్లు ట్విట్ చేసింది.
అలాగే పెంచిన హాస్టల్ ఫీజులను తగ్గించామని విద్యాశాఖ కార్యదర్శి ఆర్. సుబ్రహ్మణ్యం తెలిపారు. ఫీజుల పెంపు విషయంలో వదంతులు నమ్మొద్దని, ఇది తిరిగి తరగతులకు వెళ్లే సమయమని ఆయన ట్విటర్‌లో పేర్కొన్నారు. కాగా గత కొద్ది రోజులుగా ఫీజుల పెంపును నిరసిస్తూ విద్యార్థులు తీవ్ర స్థాయిలో ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. హాస్టల్ గది అద్దె, మెస్ ఛార్జీల పెంపు, డ్రెస్‌కోడ్‌లను విధించేందుకు వీలుగా హాస్టల్ మాన్యువల్‌లో ప్రతిపాదించిన మార్పులను ఉపసంహరించుకోవాలంటూ గత కొద్ది రోజులుగా విద్యార్థులు నిరసనబాట పట్టిన విషయం తెలిసిందే. సింగిల్ రూమ్ ఫీజు 200రూపాయల నుంచి 600 రూపాయలకు పెంచగా, డబుల్ రూమ్ 10రూపాయల నుంచి 300 రూపాయలకు పెంచారు. జేఎన్‌యూ అధికారుల తాజా నిర్ణయంతో హాస్టల్ ఫీజులు పాత పద్దతిలోనే కొనసాగనుండటంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.